సుకుమార్ దర్శకత్వం సమీక్ష

సుకుమార్ తన కెరీర్ ఆరంభం లోనే ఆర్య లాంటి ప్రేమ కథా చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. కానీ, రెండవ చిత్రం జగడం మాత్రం విమర్శల పాలయింది. ఇవేవి పట్టించుకోకుండా ఆర్య చిత్రానికి కొనసాగింపుగా ఆర్య-2 ని మొదలుపెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆ చిత్రానికి అసాధారణ గుర్తింపు తీసుకువచ్చింది. అయినా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశని మిగిల్చింది. ఫలితం ఎలా ఉన్న ఆ చిత్రం చాలామంది నటీనటులు సాంకేతిక నిపుణుల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేమ కథా చిత్రం 100% లవ్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమా సుకుమార్ ప్రేమ కథలు తెరకెక్కించటంలో దిట్ట అని మరోసారి రుజువు చేసింది. కానీ అతని స్థాయి మాత్రం టాప్ డైరెక్టర్స్ కు చాలా దూరంలో ఉండిపోయింది.


సుకుమార్ తరువాతి చిత్రం, 1 నేనొక్కడినే, తెలుగు చిత్రాల గతిని మార్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి గుర్తింపు సాధించింది. తెలుగు సినీ విశ్లేషకులు మాత్రం ఆ సినిమాను చీల్చి చెండాడారు. ఇది కూడా ఒక సినిమా యేన అని చాల మంది హేళన చేసారు. కానీ ప్రేక్షకులు మాత్రం సుకుమార్ ని సమర్ధించారు. 1 నేనొక్కడినే ఒక మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది. మహేష్ బాబు నటనను అందరూ కొనియాడారు. సుకుమార్ మాత్రం ఆ సినిమాలో లోపాలను అంగీకరించటానికి ఇష్టపడలేదు. చాలా కాలం వరకు ఆ సినిమాను ఒక కళాకండం గానే భావించాడు. ప్రేక్షకుల అభిరుచిలో లోపాలు ఉండటం వల్లే ఆ సినిమా పరాజయం పాలయిందని నమ్మాడు. వెంటనే నిర్మాతగా మరి కుమారి 21F చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా మంచి ఫలితాన్ని సాధించింది. సుకుమార్ మరోసారి రివెంజ్ థ్రిల్లర్ కథాంశంతో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా కూడా 1 నేనొక్కడినే మాదిరిగా లోపభూయిష్టంగానే తెరకెక్కింది. కానీ సుకుమార్ కథలో లోపాలను ఈసారి అంగీకరించాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. కానీ అతనికి రావాల్సిన స్థానాన్ని ఆ సినిమా సంపాదించలేకపోయింది.

2018 లో గ్రామీణ కథాంశంతో ఒక సాధారణ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలంతో సుకుమార్ తానేంటో నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ ను వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించి పెద్ద సాహసమే చేసాడని చెప్పొచ్చు. అయినా ప్రేక్షకులు అవేం పట్టించుకోకుండా సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కథను పకడ్బందీగా రాసుకుని సినిమాను తెరకెక్కించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ప్రేక్షకుడు థియేటర్ నుంచి వచ్చాక కూడా ఆ సినిమాలోని కథ పాత్రలు వెంటాడుతూనే ఉంటాయంటే ఎంత బాగా తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు. ఆర్య తరువాత సుకుమార్ సినిమాలలో అంత చక్కటి స్క్రీన్ ప్లే మళ్ళీ రంగస్థలం లోనే కనిపిస్తుంది. సాధారణ పాత్రలతో అసాధారణ భావోద్వేగాలను పలికించిన తీరు విశ్లేషకులను సైతం ఆకట్టుకుంది. రంగస్థలం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది, సుకుమార్ ను టాప్ తెలుగు డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిపింది. అంతటి విజయం తర్వాత కూడా సుకుమార్ చిత్ర నిర్మాణాన్ని విడిచిపెట్టలేదు. రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని సినిమాల నిర్మాణం మొదలుపెట్టాడు.  అతని దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ లని దర్శకులుగా పరిచయం చేసే బాధ్యత కూడా తనే తీసుకున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు తో తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఇది 1 నేనొక్కడినే తర్వాత వారి కాంబినేషన్ లో వస్తున్న ద్వితీయ చిత్రం. రంగస్థలం తరువాత ఆలస్యం చేయకుండా కథా రచన మొదలుపెట్టాడు. కొన్ని కథలను అనివార్య కారణాల వల్ల మహేష్ తిరస్కరించాడు. ప్రస్తుతం ఒక కథను సినిమాగా తీయటానికి అంగీకరించాడు. సుకుమార్ మాత్రం ఈసారి ఎలా ఐన మహేష్ కు మంచి విజయం అందించాలని కసితో పని చేస్తున్నాడు. కథా రచనకు మరో 3-6 నెలల సమయం పడుతుందని సమాచారం. సుకుమార్ రంగస్థలం విజయంతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రాజమౌళి కి పోటీగా మారాడనడం లో ఎలాంటి సందేహం లేదు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి