2018 తెలుగు సినిమా విశ్లేషణ

2018 లో తెలుగు సినిమాలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. చాలా సినిమాలు విజయాన్ని సాధించాయి కానీ అదే స్థాయిలో అపజయాలు కూడా ఉన్నాయి. చిన్న సినిమాలు పరిశ్రమను ప్రభావితం చేసాయి. తెలుగు సినిమా 2018 జయాపజయాల పై సమీక్షను చదవండి.


2018లో వచ్చిన మొదటి పెద్ద సినిమా అజ్ఞ్యాతవాసి. ఆ సినిమా సాధారణ ప్రేక్షకులను, సినీ విశ్లేషకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇది పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితం కావడానికి ముందు వెండి తెరపై ఆయన ఆఖరి చిత్రం. నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహ విజయాన్ని సాధించింది. అనుష్క నటించిన భాగమతి సత్ఫలితాన్ని సాధించింది. జనవరిలో గుర్తుండిపోయే విజయం మాత్రం దక్కలేదు. ఫిబ్రవరి లో ప్రేమకథా చిత్రాలు అధికంగా విడుదలయ్యాయి. ఛలో మరియు తొలిప్రేమ మంచి విజయాన్ని పొందాయి. టచ్ చేసి చూడు మరియు ఇంటెలిజెంట్ చిత్రాలు భారీ స్థాయిలో నిరాశపరిచాయి. అర్జున్ రెడ్డి విజయంతో ఏ మంత్రం వేసావే చిత్ర నిర్మాతలకు లైన్ క్లియర్ అయింది. ఎంతోకాలంగా ఆగిపోయిన చిత్ర విడుదల భారీ పరాజయంతో నిరాశపరిచింది. కిరాక్ పార్టీ, MLA చిత్రాలు అరకొర ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రంగస్థలం చిత్రం ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. మొదటి త్రైమాసికంలో రంగస్థలం గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది.

ఛల్ మోహన రంగ మరియు కృష్ణార్జున యుద్ధం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. భరత్ అనే నేను మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా దెబ్బతో అల్లు అర్జున్ తర్వాతి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు. మహానటి కనీవినీ ఎరుగని స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ సినిమా ప్రభావంతో మరిన్ని బయోపిక్ లు ప్రారంభం అయ్యాయి. నేల టికెట్, రాజుగాడు, ఆఫీసర్ మరియు నా నువ్వే నిరాశపరిచాయి. ముఖ్యంగా ఆఫీసర్ నాగార్జున స్థాయిని ప్రశ్నార్ధకం చేసింది. సమ్మోహనం, ఈ నగరానికి ఏమైంది సాధారణ విజయాలు పొందాయి. 2018 లో రెండవ త్రైమాసికం మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటిలో చాలా చిత్రాలు నిర్మాతలకు కొనుగోరుదారులకు నష్టాల్ని మిగిల్చాయి. కానీ ఇవన్నీ పరిశ్రమని ప్రభావితం చేయలేకపోయాయి.

పంతం మరియు తేజ్ ఐ లవ్ యు చిత్రాలు విమర్శల పాలయ్యాయి. RX100 చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. విజేత, లవర్, సాక్ష్యం, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు మరియు శ్రీనివాస కళ్యాణం చిత్రాలన్నీ నష్టాల్ని చవిచూశాయి. చి ల సౌ, గూఢచారి చిత్రాలు తక్కువ బడ్జెట్ తో నిర్మించబడి లాభాల్ని సాధించాయి. గీత గోవిందం భారీ విజయాన్ని సాధించింది. రంగస్థలం విజయానికి కొనసాగింపుగా భారీ లాభాల్ని సాధించింది. నీవెవరో, నర్తనశాల మరియు పేపర్ బాయ్ చిత్రాలు పరాజయాలుగా మిగిలాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం మంచి విజయంతో పటు విమర్శకుల ప్రశంశలు సాధించింది. మను, సిల్లీ ఫెలోస్, శైలజ రెడ్డి అల్లుడు, U టర్న్ మరియు దేవదాస్ చిత్రాలు నిరాశపరిచాయి.

నోటా చిత్రం నష్టాల్ని మిగిల్చింది. అరవింద సామెత వీర రాఘవ సాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. హలో గురు ప్రేమ కోసమే అరకొర ఫలితంతో సరిపెట్టుకుంది. సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలు భారీ పరాజయాలుగా నిలిచాయి. టాక్సీవాలా విజయ్ దేవరకొండ ఖాతాలో మరొక విజయాన్నిచ్చింది. కవచం, నెక్స్ట్ ఏంటి, సుబ్రహ్మణ్యపురం చిత్రాలు పరాజయాలుగా నిలిచాయి. అంతరిక్షం 9000kmph, పడి పడి లేచే మనసు చిత్రాలు పరాజయాలుగా నిలిచాయి. అనువాద చిత్రాలు నిరాశాజనకంగా సాగాయి. అభిమన్యుడు, సర్కార్ మరియు కెజిఫ్ చిత్రాలు లాభాలను మిగిల్చాయి. మిగిలిన అన్ని డబ్బింగ్ చిత్రాలు నిరాశపరిచాయి. తెలుగు సినిమాలు 2018 లో మిశ్రమ ఫలితాల్నిచ్చాయి.

కామెంట్‌లు